ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారాయి. ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతంగా... రాష్ట్రంలోనే తొలిసారి అత్యధిక కరోనా కేసులు నమోదైన ప్రాంతం ఇప్పుడు వైరస్ రహిత జిల్లాగా మారింది.
పకడ్బందీ ప్రణాళిక..
వైరస్ జిల్లాలో అడుగు పెట్టినప్పటినుంచి అధికారుల పకడ్బందీ ప్రణాళికలు చేశారు. అందుకు తగినట్లు చర్యలు తీసుకున్నారు. కంటైన్మెంట్ ఏరియా, రెడ్జోన్లు ఏర్పాటు చేసి... ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించడంతో 54 రోజుల అనంతరం కరోనా రహిత జిల్లాగా మారింది. మొత్తం జిల్లాలో 19 కేసులు నమోదు కాగా... చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి కూడా ఆస్పత్రి నుంచి హోం క్వారంటైన్‌కు చేరడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్తకేసులు నమోదు కాలేదు..
గత 27 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోయినా... లాక్డౌన్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ సడలించిన మార్పులకు అనుగుణంగా... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఏ కేటగిరిలోని షాపులను తెరిచేందుకు అనుమతిస్తున్నారు. బీ కేటగిరిలో ఉన్న షాపులను మాత్రం సరి, బేసి సంఖ్య విధానంతో తెరిచేందుకు అవకాశం కల్పించినా... ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఇంటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో దుకాణాలు తెరిచినా... వీధులు మాత్రం బోసిగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాస్క్‌లేకుండా రోడ్లపై కనిపించినా... సరి,బేసి సంఖ్య నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
అక్కడమాత్రం..
మరోవైపు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటలోని ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో ఆ జిల్లాలో బాధితుల సంఖ్య రెండుకు చేరింది. ముంబై నుంచి వచ్చిన వలస కార్మికుల్లో ఆరుగురి నమూనాలు ఆసుపత్రికి పంపగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. మిగతా వారిని పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచి... జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన