NAFSCOB award to Choppadandi Primary Cooperative Centre: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి 2019- 20 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీఓబీ మూడో పురస్కారం రావడం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. చొప్పదండి సహకార సంఘానికి జాతీయ స్థాయి అవార్డు రావడంతో ఆ సంఘం పాలకవర్గ సభ్యులను హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ముదాయంలో మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, సీఈవో కళ్లెం తిరుపతి రెడ్డి, సంఘం డైరెక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం: దేశవ్యాప్తంగా 95 వేలు, రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి సహకార సంఘానికి వరుసగా మూడోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం విశేషం. ఈ సొసైటీ పరిధిలో ఉన్న తొమ్మిది గ్రామాల్లో కూడా సొంత నిధులతో గోదాములు నిర్మించారు. ఈ గోదాముల ద్వారా రైతులకు తమ గ్రామంలో ఎరువులు తీసుకునే సౌకర్యం కలిగింది. సొసైటీ టర్నోవర్ రూ. 150 కోట్లుగా నమోదైంది. ఈ సంవత్సరం నికర లాభం రూ. 1.52 కోట్లు. గత 5 సంవత్సరాల నుంచి రైతులకు తమ వాటా ధనంపై 10 శాతం డివిడెండ్ ఇస్తోంది. సొసైటీ నుంచి నిరుపేద విద్యార్థులకు చదువుల నిమిత్తం 13 మందికి రూ. 65,000 ఆర్థిక సహాయం అందిస్తుండటం ఓ ప్రత్యేకత.
రైతులకు ఉత్తమ సేవలు: చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం రైతులకు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో అవార్డు రావడం అభినందనీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకుని సహకార స్ఫూర్తిని పెంచాలని సూచించారు. సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని కొనియాడారు. ఇతర సంఘాల్లో ఎక్కడా లేని విధంగా సంఘం సభ్యులకు ప్రమాద బీమా, కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం హర్షణీయమని కొనియాడారు. ఇదే స్పూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లో దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరగనున్న నేషనల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఈ అవార్డు అందుకోనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలిగించొద్దు: మంత్రి గంగుల