కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువకేంద్రంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే... కొంత మంది ఆశయాన్ని గుర్తించకుండా ఫొటోలకు పోజులు ఇవ్వడానికి ఉపయోగించుకోవడం బాధాకరమని బండి సంజయ్ తెలిపారు.
జాబ్ మేళాలు అనేసరికి ఎంతో మంది నిరుద్యోగులు ఆశతో మేళాలకు వస్తారని... అయితే అడపాదడపా ఉద్యోగాలు కల్పించడం తప్ప అసలు ఉద్దేశం నెరవేరడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు పథకాలు మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా చేపట్టాలని ప్రతి గ్రామం నుంచి యువకులను ఎంపిక చేయాలని అధికారులను ఎంపీ బండి సంజయ్ ఆదేశించారు.