చాక్లెట్లు, పిప్పరమెంట్లతో జీవితాలు బాగుపడవని దళిత బంధు పథకాలతోనే జీవితాల్లో మార్పు వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భాజపా నుంచి తెరాసలోకి చేరిన యువకులకు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పంపిణీ చేశారని ఓ యువకుడు గోడ గడియారాలు, గొడుగులను మంత్రి హరీశ్ రావు సమక్షంలో వేదికపై ధ్వంసం చేశాడు.
గుణాత్మక మార్పు రావాలి
నిజంగా మార్పు రావాలి. గుణాత్మక మార్పు రావాలి. చాక్లెట్లు, పిప్పరమెంట్లతో బతుకుతామా? ఓ తమ్ముడు చెప్పిండు... గడియారం, బొట్టుబిల్లలు, ఛత్రీలు ఇచ్చిండు అని. ఆ చాక్లెట్లు, పిప్పరమెంట్లతో మనం బతుకం. మన జీవితంలో మార్పు రావాలి. మన కాళ్ల మీద మనం నిలబడే స్థితి రావాలి. ఆ దిశగా సీఎం కేసీఆర్... దళిత బంధు ఇచ్చారు. దాన్ని అందిపుచ్చుకుని మీ అందరు ముందుకు నడవాలి.
- హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
సక్రమంగా వినియోగించుకుని
సమయం వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దామని హరీశ్ రావు అన్నారు. దళిత బంధు అమలులో బాధ్యత తీసుకోవాలని తెరాస శ్రేణులకు సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. దళిత బంధును సక్రమంగా వినియోగించుకుని... ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలని ఆకాంక్షించారు. సమాజం ముందు గొప్పగా ఉంటే తమకు అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
డిపాజిట్ రాదని తెలిసే..
కాంగ్రెస్ పార్టీపైనా.. మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో డిపాజిట్ కూడా రాదని తెలిసి దళితునికి టికెట్ ఇస్తామని అంటున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లగాడిని అడిగిన హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదని చెబుతాడని అన్నారు. దళితులను అవమానించడానికే టికెట్ ఇస్తామని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎందుకు ఎస్సీకి సీటు ఇస్తామని అంటుందో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
మాయవతి కూడా చేపట్టలేదు..
దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన పథకాలను మాయావతి యూపీ సీఎంగా ఉండి కూడా చేపట్టలేకపోయారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమై... ఈ రాష్ట్రంలోని దళితుల అందరికి వెలుగు నింపే కార్యక్రమమని స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే