మానేరు నది (maneru river) ప్రవాహంతో కరీంనగర్ నగర సమీపంలోని తీగల వంతెన పక్కన నిర్మించిన రిటర్నింగ్ వాల్ ధ్వంసమైంది. శుక్రవారం ఉదయం కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ 18 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేయగా.. వరద ఉద్ధృతిని తట్టుకోలేక కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది.
మూడు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరదతో దిగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. దీనితో గురువారం సాయంత్రం 12 గేట్లు తెరిచి 60వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ భాగంలో నీటి ఉద్ధృతి మరింత పెరగడం వల్ల శుక్రవారం ఉదయం మరో ఆరు గేట్లు ఎత్తారు. దీనితో లక్షకు పైగా క్యూసెక్కుల నీరు మానేరు నదిలోకి విడుదల అవుతుంది.
అక్కడ శ్మాశాన వాటిక పక్కనుంచి తీగల వంతెనకు సమాంతరంగా మూడు గజాల ఎత్తు మానేరు నదిపై అడ్డుగోడ నిర్మించారు. మరో రెండు గజాల ఎత్తు గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. అంతలోనే మానేరు నది ప్రవాహంతో గేట్లు తెరిచారు. దీనితో రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోగా.. సుమారు 30 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. నాణ్యత లోపంతో అడ్డు గోడ కూడా ధ్వంసమైందని ఆరోపణలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ (minister gangula kamalakar).. హుటాహుటిన తీగల వంతెన వద్దకు చేరుకుని ధ్వంసమైన గోడను పరిశీలించారు.
ఇదీ చదవండి: Kodandaram: 'రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది'