సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ భాజపాకు ఓటేస్తే.. ధరలను పెంచేందుకు అధికారం ఇచ్చినట్లేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి పర్యటించారు. సీటీ సెంట్రల్ హాల్‌లో పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, తెరాస నాయకులు ఎల్.రమణ హాజరయ్యారు. పద్మశాలి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎకరం స్థలం, రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను పద్మశాలి సంఘం నాయకులకు అందించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి గంగుల తీవ్ర విమర్శలు చేశారు. భాజపా, కాంగ్రెస్.. దిల్లీ పార్టీలని, తెరాస.. మన పార్టీ అని మంత్రి తెలిపారు. "తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకున్నాం. కాంగ్రెస్, భాజపాకు మళ్లీ ఓటేసి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుందామా..? భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. భాజపాలో ఇప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ముగ్గురు మాత్రమే అవుతారు. వాళ్లతో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించని ఈటల రాజేందర్... ఇప్పుడు ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర చేస్తున్నారు." -గంగుల కమలాకర్, మంత్రి
ఇవీ చూడండి: