కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా వల్ల పెయిడ్ రూములు, ఇతరత్రా సదుపాయాల కారణంగా ఆదాయం గణనీయంగా పడిపోయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దీనివల్ల ఆసుపత్రి సిబ్బందికి వేతనాల చెల్లింపునకు కూడా ఇతర నిధుల నుంచి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మాతాశిశు కేంద్రం వల్ల ఆసుపత్రి ఎనలేని ఖ్యాతి గడించిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.
ఇప్పటికే పోస్టుమార్టం విభాగం నిర్మాణం పూర్తైనా.. ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు. ఆసుపత్రి చుట్టూ వాణిజ్య అవసరాల కోసం షట్టర్లు నిర్మించే విధంగా.. ప్రణాళిక సిద్ధం చేయాలని సూపరింటెండెంట్‌ను మంత్రి గంగుల ఆదేశించారు.