నిరుపేదలకు ఉచితంగా సిటీ స్కాన్ సేవలు అందించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రెండుకోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సిటి స్కాన్ చాలా ఖర్చుతో కూడుకున్న కారణంగా పేదలపై ఆర్ధిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను రాష్ట్రప్రభుత్వం పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు.
కరోనా నేపథ్యంలో ఐదువేల వరకూ ఛార్జి చేసే ప్రైవేట్ ఆస్పత్రులు రెండువేలతో సిటీ స్కాన్ చేసివ్వాలని ఆదేశించినట్లు మంత్రి గుర్తు చేశారు. అయినప్పటికీ నిరుపేదలు ఆ రెండు వేలు సైతం ఖర్చు చేయడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు పూర్తి ఉచితంగా సిటీ స్కాన్ అందిస్తామని, కార్డు లేని వారికి 500 రూపాయలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకపూట మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని.. వచ్చే నెల మొదటి తేదీ నుంచి మరో ఇద్దరిని నియమించి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
ఉచితంగా సేవలు..
ఇవాళ్టి నుంచి సిటీస్కాన్ సేవలు నిరుపేదలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే స్కానింగ్ తీయడం జరగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రేడియాలజిస్టు, ఒక అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. త్వరలోనే మరో రేడియాలజిస్టుతో పాటు అసిస్టెంట్‌ను రిక్రూట్ చేసుకునేలా ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘంలో ప్రస్తావించా. . తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు పూర్తి ఉచితంగా సిటీ స్కాన్ అందిస్తాం. కార్డు లేని వారికి కేవలం 500 రూపాయలకు అందిస్తాం. -గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖమంత్రి
ఇదీ చదవండి: Kishan Reddy Injure: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయం