భూసంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందించడానికి బాటలు నిర్మించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా కరీంనగర్‌లోని మల్టీపర్పస్ పాఠశాలలో మేయర్ సునీల్‌రావుతో కలిసి ఆయన విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఉజ్వల పార్క్‌లోని పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
పీవీ అంటే ఎంతో అభిమానం..
తెలంగాణ ప్రాంతంలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగి.. దేశం గర్వించే స్థాయిలో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గంగుల కొనియాడారు. బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు దేశంలోని అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉండేదన్నారు. పీవీ అంటే తనకు ఎంతో అభిమానని పేర్కొన్నారు. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని వెల్లడించారు. రాజనీతి కలిగిన ఆయన.. భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. పీవీ స్మారకార్థం మల్టీ పర్పస్ స్కూల్ ఆవరణలో 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. పనులు 15 రోజుల్లోనే మొదలు పెడతామన్నారు.
"కరీంనగర్ జిల్లాలో పీవీ నరసింహరావు లాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టడం నగర ప్రజల అదృష్టం. దేశంలోని అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆయనంటే వ్యక్తిగతంగా నాకు ఎంతగానో ఇష్టం. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. 15 రోజుల్లోనే పనులు మొదలు పెడతాం. రాబోయే కాలంలో నగరంలో మంచి ఐలాండ్ ఏర్పాటు చేస్తాం".
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
ఇదీ చూడండి: Remembering PV: ఘనంగా పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలు