రైతు వేదిక భవనాల నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి మొగ్ధుంపూర్, బద్దీపల్లి గ్రామాల్లోని రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు. రైతులకు పంట సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడం, వారి సమస్యలను ఒక వేదికపై చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలు చేపట్టిందని మంత్రి తెలిపారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వేదికల్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు వివరిస్తారని వెల్లడించారు. అన్నదాతలకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైతు వేదిక భవనంలో ఏఈవో గది, మట్టి నమూనా పరీక్షలు చేసే గది, సమావేశ మందిరం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి ఉండేలా నిర్మాణం చేస్తున్నామని గంగుల తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని రైతు వేదిక భవనాలను సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని వెల్లడించారు.