కరోనా కారణంగా చాలా మందికి ప్లాస్మా ఎంతో అవసరమవుతోంది. వారి అవసరాన్నిఆసరాగా మలుచుకుని సొమ్ము చేసుకున్న ఓ వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన భూక్యా బాలచందర్(26) కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. కేయూలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా పనిచేసే సమయంలో రక్తదానంపై అవగాహన పెంచుకున్నాడు. కొవిడ్ బారిన పడిన అనేక మంది ప్లాస్మా కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటం గుర్తించిన బాలచందర్ ప్లాస్మా దానం చేయడానికి తాను సిద్ధమంటూ వారికి సమాధానం ఇచ్చాడు. ప్రయాణ ఖర్చుల కింద డబ్బు అందిస్తే సరిపోతుందని బాధితులకు చెప్పి.. డబ్బు పంపగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు.
ఈ విధంగా.. కరీంనగర్‌కు చెందిన ఓ బాధితుని కుటుంబ సభ్యుడు బాలచందర్‌ను నమ్మి డబ్బును పంపించి మోసపోయాడు. ఈ విషయాన్ని సీపీ కమలాసన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బాలచందర్‌ను పట్టుకున్నారు. మూడో ఠాణా పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజ్ఞాన్‌రావు తెలిపారు. కరోనా బాధితులను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
- ఇదీ చూడండి: మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ