కరీంనగర్ డెయిరీలో ప్రయోగాత్మకంగా 2018లో 1,240 పశువులకు లింగ నిర్ధారణ వీర్యం ఇచ్చారు. ఈ ప్రక్రియతో కొన్ని ఆవులు 76 పెయ్య దూడలకు జన్మనిచ్చాయి. మరికొన్ని గర్భం దాల్చాయి. బాగా పాలిచ్చే ముర్ర, జెర్సీ ఆవులు, ఒంగోలు, గిర్, సాహివాల్ తదితర రకాల ఆవుల జాతుల వీర్యాన్ని డెయిరీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
50శాతం రాయితీతో...
సాధారణంగా ప్రతి వీర్యం డోసు ధర రూ.900 ఉంటుంది. పశు పోషణను ప్రోత్సహించడానికి గాను డెయిరీ ద్వారా 50 శాతం రాయితీతో వీర్యాన్ని అందిస్తున్నారు. కరీంనగర్ డెయిరీ ఇలా లింగ నిర్ధారిత వీర్యంతో పాటు ఒక్కో పశువును పోషించడానికి ప్రోత్సాహకం అందిస్తోంది. పెయ్య దూడ పుట్టగానే రూ.500 నగదు, రూ.1500 విలువైన దాణా అందిస్తారు.
రూ.43 కోట్లతో ప్రయోగశాల...
ప్రస్తుతం పుణెలోని భారతీయ ఆగ్రో నుంచి వీర్యం కొనుగోలు చేస్తున్నామని, త్వరలో కరీంనగర్‌లోనే వీర్యం ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చలిమెడ రాజేశ్వర్‌రావు తెలిపారు. దీని కోసం రూ.43 కోట్లతో ప్రయోగశాలను నిర్మిస్తున్నామని, ఇందులో ఎక్స్, వై క్రోమోజోములను విభజించి కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టే విధంగా వీర్యాన్ని తయారు చేస్తామని ఆయన వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా విధానాన్ని అమలుచేయాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మేడారం చిన జాతరకు ముందే తరలివస్తున్న భక్తులు