కరీంనగర్ జిల్లా వీణవంక పోలీసు స్టేషన్ ఏఎస్సై యాదగిరి కరోనాతో కన్నుమూశారు. రెండ్రోజుల క్రితమే ఆయనకు కరోనా నిర్ధరణ కాగా.. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహమ్మారి దెబ్బకు ఇవాళ మృతి చెందారు. ఇటీవలే మహశివరాత్రి రోజున వేములవాడ పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహించారు.
ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. యాదగిరి ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండో టీకాను తీసుకున్నారు. ఆయన మృతిపట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏఎస్సై కుటుంబానికి మంత్రి, పోలీసులు సంతాపం ప్రకటించారు.