క్రీడాకారులు నిరంతర శ్రమతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి సౌందర్య ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికల హాకీ పోటీలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడల్లో యువత రాణించేందుకు తమవంతు సహకారం అందిస్తాం. ఆటల వల్ల పిల్లలకు శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుత యువతరం మొబైల్, ల్యాప్టాప్ ఆటల నుంచి బయటపడాలి. రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నందుకు హాకీ క్రీడాకారిణి సౌందర్యకు ధన్యవాదాలు.- గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి
దేశరక్షణ కోసం తన నలుగురు కుమారులను త్యాగం చేసిన గురు గోవింద్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నేటి తరం యువత క్రీడలు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. క్రీడల వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ హర్మీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సౌందర్యను మంత్రి గంగుల సన్మానించారు.