బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కరీంనగర్‌లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 24 గంటల పాటు నీరివ్వడానికి డీపీఆర్ రూపొందుతోందని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుతో కలిసి రిజర్వాయర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గతంలో తాగునీటి ట్యాంకర్ల వెంట మహిళలు పరుగులు పెట్టే పరిస్థితి ఉండేదని గంగుల పేర్కొన్నారు. పక్కనే మానేరు జలాశయం ఉన్నా.. కరీంనగర్‌కు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం మిషన్ భగీరథ కింద రూ.110 కోట్ల వ్యయంతో మంత్రి కేటీఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ జలాశయాన్ని నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సీఎం నిర్ణయం మేరకు కరీంనగర్‌లో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు. టవర్ నిర్మాణం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మరోవైపు తీగల వంతెన ద్వారా పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కరీంనగర్‌లో పార్కుల అభివృద్ధి కోసం సైతం డీపీఆర్ రూపొందుతోందని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీచూడండి: ఐసోలేషన్ కిట్.. అందరికీ దక్కదు.. అన్నీ ఉండవు..!