Diwali Festival In Graveyard: రాష్ట్రమంతా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకుంటారు.. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్‌లో మాత్రం ఇళ్లు, వ్యాపార సముదాయాలతో పాటు ఏకంగా శ్మశానంలోనూ పండుగ జరుపుకొనే విచిత్రమైన ఆచారం ఉంది. గత ఆరు దశాబ్దాల నుంచి శ్మశాన వాటికలో దీపావళి జరుపుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవటం ఒక ఆచారంగా నిర్వహిస్తారు. కరీంనగర్ కార్ఖానగడ్డ హిందూ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరం ఎస్సీ కుటుంబాలు శ్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువుల సమాధుల వద్ద దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు శ్మశానవాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు.
కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధులను అలంకరిస్తారు. పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు. అక్కడే.. దీపావళి జరుపుకుంటారు. నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటారు. తమ పూర్వీకులు తమ మధ్యలో లేకపోయినా ఆ లోపం కనపడకుండా ఉండేందుకు పండుగ రోజు కుటుంబ సభ్యులంతా శ్మశానానికి వస్తుంటామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి, వారికిష్టమైన పిండివంటలు పెట్టి, అక్కడే టపాసులు కాలుస్తూ అర్ధరాత్రి వరకు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. వివిధ వర్గాలు తమ ఇళ్లతో పాటు వాణిజ్యసముదాయాల వద్ద పండుగను జరుపుకుంటే, వీరు మాత్రం స్మశానంలో జరుపుకుంటారు.దీపావళి రోజు ఇలా చేస్తే మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.
కొంచెం వింతగా అనిపించినా.. చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దండు అంజయ్య, స్థానికుడు, కరీంనగర్ ఆనవాయితీగా వివిధ వర్గాల వారు శ్మశానంలో దీపావళి జరపుకుంటుండటంతో నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా జనరేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వీధిదీపాలు ఏర్పాటు చేస్తోంది.
ఇవీ చదవండి: