రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా కరీంనగర్. జిల్లా విభజనతో అడవే లేకుండాపోగా... అక్రమాలకు కొదవే లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంగానే కలప వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. పలు జిల్లాల నుంచి కరీంనగర్‌కు అక్రమంగా వేలాది టన్నుల కలప తరలిస్తున్నారు.
ఆదిలాబాద్, మంథని, మహారాష్ట్ర నుంచి కూడా జోరుగా కలప రవాణా జరుగుతోంది. కొందరు అటవీ అధికారులే పర్మిట్లు జారీచేసి జీరో దందాకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కర్ర వస్తుండగా అందులో జీరో ఎంత, సక్రమమెంత.. నన్నది లెక్కలు లేవు.
రాష్ట్రం మొత్తం మీద కరీంనగర్ జిల్లా అడవుల వాటా ప్రస్తుతం 0.30%. అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. హుజూరాబాద్ పరిధిలో ఆకునూరులో 692 హెక్టార్లలో... కరీంనగర్ వెంకటాయపల్లిలో 101 హెక్టార్లలో మాత్రమే మిగిలి ఉంది. మొత్తం 60 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొన్నాళ్లుగా వీరు ఇక్కడే పాతుకుపోవడం అడవి దొంగలకు వరంగా మారింది. ఇటీవల అడవుల సంరక్షణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. జిల్లాలో 21 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది.
పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులే ముఖ్యం. జనాభా పెరుగుదల, అభివృద్ధి కారణంగా ఇవి అంతరించి పోతున్నాయి. చెట్లు తగ్గి ఆహారం కోసం.. జంతువులు జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి. అడవుల సంరక్షణే వీటన్నింటికి పరిష్కారం.
అడవుల సంరక్షణపై దృష్టిపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం అడవి దొంగల భరతం పడుతోంది. ఇప్పటికే అక్రమ కలప స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. వీటిని నిరంతరం కొనసాగించాల్సి ఉంది. అప్పుడే అడవితల్లికి పూర్వ వైభవం వస్తుంది.