అకాల వర్షాలతో చేతికందిన పంట నేలపాలయ్యింది. ఆరుగాలం పండించిన పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో వరి, పత్తి ఇతర పంటలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. పొలంలోని వరి నేలవాలింది. కోసిన వరి ధాన్యం మొలకెత్తింది. వర్షాలకు నానడం వల్ల పొలంలోని పత్తిలో మొలకలు వచ్చాయి. వేలాది రూపాయల పెట్టుబడులు నీటి పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల ఎకరాల్లో...
వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, సహయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. డివిజన్ పరిధిలో 6,278 మంది రైతులకు 8,942 ఎకరాల వరి దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. 1,234 మంది రైతులకు చెందిన 2,045 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు