కరీంనగర్ జిల్లాపై కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే జిల్లాలో 86 కేసులు నమోదు కాగా.. ఒక్క కరీంనగర్ నగరంలో 79 కేసులు నమోదు కావడం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గత నాలుగైదు రోజులుగా వరసగా అధిక కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బయటపడిన కేసుల్లో ఎక్కువగా ఒకే కుటుంబానికి చెందినవే అధికంగా ఉన్నాయి. ఒక్కో ఇంట్లో కనిష్ఠంగా నలుగురు గరిష్ఠంగా ఏడు కేసుల వరకు నమోదవడం పట్టణవాసులను కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలో మొత్తంగా 367 కేసులు నమోదు కాగా.. గడిచిన పక్షం రోజుల నుంచే ఊహించని ఉద్ధృతి పెరుగుతోంది.
పెద్దపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 110కి చేరుకుంది. సోమవారం జిల్లాలో మరో 6 కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు రామగుండం కార్పొరేషన్ పరిధిలోనివి కాగా మరొకటి పెద్దపల్లి మండలంలో నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వైద్య దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 9 మందికి వైరస్ పాజిటివ్ రాగా.. ఇప్పటి వరకు 125 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఐదుగురు మృతి చెందారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక