పోలీస్ స్టేషన్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన మానకొండూరు సీఐ ఇంద్రసేనా రెడ్డిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఇన్ఛార్జీగా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సంతోష్ కుమార్‌కు మానకొండూరు బాధ్యతలు అప్పగించారు. ఈ సంఘటనపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విచారణకు ఆదేశించిన విషయం విదితమే.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ సంఘటనపై స్పందించిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఏం చేసినా సహించబోమన్నారు. పోలీస్ స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని సీపీ వెల్లడించారు.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లా మానకొండూరులో గుత్తేదారు పుట్టిన రోజు వేడుకలు పోలీస్ స్టేషన్లో జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిని స్వయంగా సీఐ ఇంద్రసేనా రెడ్డి... పీఎస్‌కి పిలిపించుకొని కేక్ కట్ చేయించడం, శాలువా కప్పడం, పూలమాలలు వేయడం చర్చనీయాంశంగా మారాయి. కేక్ కట్ చేయిస్తూ చేసిన ఈ వేడుక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గుత్తేదారు పుట్టినరోజు వేడుకలు స్టేషన్లో జరపడమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్పందించిన సీఐ ఇంద్రసేనా రెడ్డి... రవీందర్ రెడ్డి తనకు దగ్గరి బంధువు కావడం వల్లే వేడుక నిర్వహించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: అలా వచ్చాడు... ఇలా కొట్టేశాడు...