దేశంలో, రాష్ట్రంలో విచ్చలవిడిగా విజృంభిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను బహిర్గతం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దేశం, రాష్ట్రంలో కరోనా టీకాలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఆఖరికి దహన సంస్కారాలు నిర్వహించుకోడానికి కూడా ఏర్పాట్లు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.
ప్రభుత్వం పూర్తిగా దైవం మీద వదిలేసినట్లుగా చేతులెత్తేసిందని ఆరోపించారు. స్వల్ప లక్షణాలతో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లు ఐసోలేషన్ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం ఎంత అచేతనంగా వ్యవహరిస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తీసుకోకపోగా, కరోనా వ్యాప్తికి అవకాశమున్న ఎన్నికలను మాత్రం నిర్వహించేందుకు మొగ్గు చూపడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బడులు, గుడులు అన్ని బంద్ చేసి, బార్లు మాత్రం తెరచి రాత్రి పూట కర్ఫ్యూ విధించామంటూ రాష్ట్ర ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : జిల్లాలోకి మూడు మావో గ్రూపులు.. అప్రమత్తమైన పోలీసులు