తెరాసను వీడిన ఈటల రాజేందర్(Etela Rajender)... రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా (Bjp) గూటికి చేరారు. భాజపా నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన అనునిత్యం జనంలోనే ఉంటున్నారు. ఈటల గెలుపే లక్ష్యంగా భాజపా రాష్ట్ర నాయకత్వం పక్కా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. నియోజకవర్గ ఇంఛార్జిగా మాజీ ఎంపీ జితేందర్‌తోపాటు... ప్రతి మండలానికి మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బాధ్యులుగా నియమించింది. ఎప్పటికప్పుడు ప్రచారసరళి అంచనా వేస్తూ వ్యూహాలకు పదునుపెడుతోంది.
రూట్‌మ్యాప్...
ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదం చేసేలా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp State President Bandi Sanjay) చేపట్టిన... ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) హుజూరాబాద్‌లో ముగిసేలా ముందస్తుగా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. వారు భావించినట్లుగానే బండి పాదయాత్ర హుజూరాబాద్ నియోజకవర్గంలో సాగుతున్నపుడే ఉపఎన్నికల ప్రకటన వెలువడింది. అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ఉపఎన్నిక దృష్ట్యా ముగింపు బహిరంగ సభను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎత్తులకు పైఎత్తులు...
ఇప్పటికే తెరాస ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తున్న భాజపా నోటిఫికేషన్ వెలువడటం వల్ల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులను ప్రచారంలో తలమునకలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికార తెరాసకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి అమిత్ షా (Amitsha), జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటల రాజేందర్‌కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, తెరాస సర్కార్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ విజయానికి దోహాదం చేస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి...
హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి (Congress focus on candidate)సారించింది. షెడ్యూల్ విడుదలతో అభ్యర్థి ఖరారుపై నాయకులు దృష్టి పెట్టారు. ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ... మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), మాజీ ఎంపీపీ సదానందం, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణా రెడ్డి పేర్లను సూచిస్తూ పీసీసీకి, ఏఐసీసీకి నివేదికలు అందించారు. కొండా సురేఖ స్థానికేతరురాలు కావడం వల్ల ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపిస్తుందని స్థానిక నేతలు పీసీసీ దృష్టికి తీసుకురావడంతో ఆమె పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. పోటీలో నిలిచేందుకు 19 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
ఒకట్రెండు రోజుల్లో...
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వారు 11 మంది కాగా మిగలిన 8 మంది స్థానికేతరులు. అక్కడ దళిత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. తాజాగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ (Dcc president satyanarayana) వైపు పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ రావును ఎంపిక చేస్తుందా లేక కొత్త వ్యక్తులను కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా వేచి చూడాలి.