కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీణవంకలోని సమ్మక్క-సారక్క గద్దెల నిర్మాణ పనుల వద్ద ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. గత నాలుగు దశాబ్దాలుగా రామకృష్ణ రెడ్డి తమ నాలుగు ఎకరాల స్థలంలో జాతర కోసం వచ్చే భక్తుల కోసం సొంత డబ్బుతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మాత్రం నిర్మాణాలు చేపట్టేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన నిధులను కేటాయించారు. అంతేకాకుండా 20 మందితో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిటీలు ఏర్పాటు చేయడం ఏమిటని రామకృష్ణారెడ్డి వర్గీయులు కోర్టుకు వెళ్లారు. కొత్తగా వేసిన కమిటీ చెల్లదని.. కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆ ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం ఇప్పుడు ఘర్షణకు దారితీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కౌశిక్‌రెడ్డి వర్గీయులకు పోలీసులు మద్దతిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్మాణాలు వెంటనే ఆపేయాలని రామకృష్ణారెడ్డి వర్గీయులు ఓవైపు.. అంగీకరించేది లేదని కౌశిక్ రెడ్డి వర్గీయులు మరోవైపు పట్టుదలతో ఉన్నారు.
ఇదీ చూడండి: