హుజూరాబాద్(Huzurabad by election 2021)లో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. తెరాస-భాజపాలు ప్రచార జోరులో హోరెత్తిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ప్రచారం నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తెరాస యోచిస్తోంది. కరోనా దృష్ట్యా ముఖ్య ప్రచారకర్తల బహిరంగ సభలకు వెయ్యి మందినే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. మందిరాల్లో జరిగే సమావేశాల్లో 200 మంది వరకే అనుమతించాలని సూచించింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో కేసీఆర్ సభలపై ఉత్కంఠ నెలకొంది.
కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రుల భారీ బహిరంగ సభలు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినందున.. అదే తరహాలో సడలింపులు కోరాలని తెరాస భావిస్తోంది. మరోవైపు రోడ్‌షోలు నిర్వహించాలని తొలుత భావించిన మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సభలకే హాజరుకావాలని నిర్ణయించారని తెలుస్తోంది. సీఎం సభలకు ప్రత్యేక అనుమతిని కోరతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు.
వేడివేడిగా సాగుతున్న హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం(Huzurabad by election campaign 2021)లో తెరాస-భాజపాలు ఒకరిపైమరొకరు విమర్శల జల్లు కురిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తెచ్చిన పథకాల ఫలాలు అనుభవిస్తున్న లబ్ధిదారులను అడిగితే మానవత్వం గురించి చెబుతారని అన్నారు. సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్న భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
మరోవైపు.. తెరాసపై భాజపా అభ్యర్థి ఈటల విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ నుంచే తెరాస పతనం ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు. తన రాజీనామాతో.. పడకేసిన పథకాలను పరుగులు పెట్టించి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని డబ్బుల సంచులతో ఏమార్చాలని చూస్తున్నారని, అంతిమ విజయం ధర్మానిదేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు.
ఇటీవలే హుజూరాబాద్(Huzurabad by election campaign 2021)లో భాజపా నిర్వహించిన ఎన్నికల శంఖారావంలో ఈటలకు మద్దతు తెలిపేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కరెన్సీ నోటుకు కమలం పువ్వుకు మధ్య పోరాటం జరుగుతోందని సంజయ్ అన్నారు. ఈ సంగ్రామంలో కమలం పువ్వుదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad by election 2021)లో అభివృద్ధి నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నట్లు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) చెప్పారు. ఈటల రాజేందర్ రెండు సార్లు గెలిచి మంత్రిగా ఉన్నా.. అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రచారంలో అపూర్వ స్పందన లభిస్తోందని వెల్లడించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవం ముఖ్యం కాదని... నియోజకవర్గ అభివృద్ధి, ఆత్మగౌరవం చూసి ప్రజలు ఓటేస్తారని అన్నారు.
అభివృద్ధి నినాదం.. దళితబంధు ఆయుధంతో అధికార పార్టీ.. ఎన్నికల ప్రచారంలో వేగంగా దూసుకెళ్తుంటే.. తెరాస వైఫల్యాలను ఎండగడుతూ భాజపా ప్రజల్లోకి వెళ్తోంది. నిరుద్యోగ నినాదంతో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. బహిరంగ సభలు.. ఆయన ప్రసంగాలు ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాల్సిందే...