దేశవ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని కార్మిక, ప్రజా సంఘాలు జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కరోనా సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాసంఘాలు గత నెల 17 నుంచి ఆగస్ట్ 9 వరకు అనేక ఆందోళనలు నిర్వహించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అందుకే క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో... ఆగస్టు 9న సేవ్ ఇండియా పేరుతో జైల్ బరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేసి, నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి అండగా 6నెలల పాటు 7500 రూపాయలు అందజేయాలని కోరారు. కార్మిక చట్టాల సవరణ విరమించుకొని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఉపాధి కూలీలకు 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత