Central Sahitya Academy Award in Translation category: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగిరెడ్డి నారాయణరెడ్డి సహా ఇప్పటివరకు ఐదుగురికి కేంద్ర సాహిత్య అవార్డులు రాగా.. ఈ ఏడాదే రెండు కేటగిరీల్లో కవులు అవార్డులు దక్కించుకున్నారు. సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్ బాల సాహిత్యంలో అవార్డు పొందగా, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ ఎంపికయ్యారు. ప్రముఖ ఉర్దూ, పంజాబీ కవి గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్‌ను పవన్ కే వర్మ ఆంగ్లానువాదం చేయగా.. వారాల ఆనంద్ ఆకుపచ్చ కవితలు పేరుతో తెలుగులోకి అనువదించారు.
గుల్జార్ హిందీలో రాసిన గ్రీన్ పోయెమ్స్‌లో 58 కవితలు ప్రకృతికి సంబంధించనవే ఉన్నాయి. తనకీ అవార్డు రావడం పట్ల వారాల ఆనంద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడలో పుట్టి పెరిగిన ఆనంద్ కరీంనగర్‌లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు, కథలు రాయడం ఆనంద్‌కు అలవాటు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలల్లో 36 ఏళ్ల పాటు గ్రంథపాలకునిగా పని చేశారు. ఆనంద్ మొదట డిటెక్టివ్ నవలలు బాగా చదివేవారు.
ఆ తర్వాత తన మేనమామ గ్రంథలాయంలో సుప్రసిద్ధ రచయితల నవలలు చదువుకున్నారు. అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలతీతవ్యక్తులు, అంపశయ్య లాంటి నవలలతో పాటు శ్రీశ్రీ కవిత్వం చదివి ప్రగతిశీల ఉద్యమ ప్రభావానికి గురయ్యారు. తెలిసిన భాషలో పుస్తకాలు రాసుకోవడం కాకుండా ఇతర భాషల సాహిత్యంపై అవగాహన పెంచుకున్నప్పుడే సాహిత్యానికి విలువ పెరుగుతుందని నమ్ముతున్నారు ఆనంద్.
తనకు కేంద్ర సాహిత్య అవార్డు రావడం వల్ల దక్కిన గౌరవం గుల్జార్‌కే చెందుతుందని చెబుతున్నారు. డిగ్రీ చదువుతున్నప్పుడే ఆనంద్ తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ తరం పిల్లల్లో సాటి మనిషిని ప్రేమించే కళాత్మక స్పృహ పెంపొందించేందుకు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ సాహిత్యం దోహదం చేస్తాయని చెబుతున్నారు. వేములవాడలో కళానికేతన్ సంస్థ వేదికగా జరిగే సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సాహిత్య ప్రపంచాన్ని విస్తరించుకున్నారు ఆనంద్.
ఇవీ చదవండి: