హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు స్పష్టం చేసింది. పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది.
సాఫీగా సాగేలా చర్యలు..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, పోలీసు శాఖ నోడల్ అధికారి జితేందర్, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షలో పాల్గొన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన ఈసీ అధికారులు... శాంతిభద్రతలు, కొవిడ్ నిబంధనల అమలుపై ఆరా తీశారు. పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కమిషన్... స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వెంటనే పంపించివేయాలని ఆదేశించింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్య జరగకుండా చూడాలని, పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు.
ఎప్పటికప్పుడు నివేదికలు..
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని... వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులు, పరిశీలకులను ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: