1lakh scheme To BC In Telangana : రాష్ట్రంలో కులవృత్తిదారులకు చేయూతగా ప్రభుత్వం లక్ష రూపాయల సాయం ప్రకటించింది. లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నా... నేరుగా అధికారులను కలిస్తే తప్ప ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు సమీపిస్తున్న తరుణంలో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
'ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి రెండు రోజులు అవుతుంది. కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే సార్ వస్తలేరు వచ్చినా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు కానీ సిస్టమ్ దగ్గరికి పోవడంలేదు. మరెవరన్నా పెద్దలు చెప్పిర్రా కులం సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని. ఇలా జనాలను పిచ్చివాళ్లలాగా తిప్పించండి అని చెప్పారా. లేకపోతే ఈ లక్షరూపాయలు ఎందుకు పెట్టారు. కేసీఆర్, గంగుల కమలాకర్ ఎందుకు పెట్టారు ఇది. మా వల్ల మీ సేవా వాళ్లు, జిరాక్స్ వాళ్లు బతుకుతున్నారు. వీళ్ల కోసమా ఇది పెట్టింది. దరఖాస్తులో కులం ధ్రువీకరణ తీసేయండి. లక్ష రుపాయలు కచ్చితంగా ఇస్తామని చెప్పండి రాత్రి వరకైనా ఉండి చేయించుకుంటాం లేదా దరఖాస్తు తేదీని పొడిగించండి.' -హరీష, అర్హురాలు
Financial Assistance To BC Communities : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మీసేవా కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం వెనకబడిన వర్గాల్లోని 14కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు రుణం ఇస్తానని ప్రకటించడమే కాకుండా....ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారం రోజుల నుంచి ఈ పత్రాల కోసం అధికారుల చుట్టు తిరగడంతో వందల రూపాయలు ఆటో ఛార్జీలుగా అవుతున్నారయి దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఎవరో పెద్దవారు వస్తారు వారు రికమెండేషన్ పెట్టుకుంటారు వాళ్లకు సెర్టిఫికెట్ తొందరగా వస్తాయి. మరి మాలాంటి సామాన్యులకు ఎవరిప్పిస్తారు సర్. ఫస్ట్ అవినీతిని అరికట్టండి. జనాలు కొట్టుకు చచ్చేలాగా పాలసీలు, స్కీమ్లు పెట్టకండి. పెడితే ఓ పద్ధతి ప్రకారం ప్రక్రియ జరిగేలా చూడండి' - సునీత, దరఖాస్తుదారురాలు
దరఖాస్తుల సంఖ్య ఒక్కసారి పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. లాగ్ఇన్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది అని అధికారులు తెలిపారు. ఒకేసారి ఇన్ని దరఖాస్తులు రావడంతో సైట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీసేవా వారు చెబుతున్నారు. సాంకేతికి లోపం వల్ల పనులు ఆగిపోతున్నాయి అది రెక్టిఫై అయ్యాక పని సులువుగా అవుతుందని అన్నారు.
'గతంలో రోజుకు 100 దరఖాస్తులు వస్తే ప్రస్తుతం రోజు 1000కి పైగా దరఖాస్తులు రావడంతో ఇబ్బందవుతుంది. రాష్ట్ర మొత్తం సైట్లో ఇబ్బందులు ఉన్నాయి. డేట్ పెంచుతారో లేదో తెలీదు సైట్ అప్డేట్ అయ్యాక పని పూర్తి అవ్వడానికి చూస్తాం.' - శ్రావణ్, డిప్యూటీ తహసీల్దార్
త్వరితగతిన అధికారుల ధ్రువపత్రాల మంజూరుపై దృష్టిసారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్‌లైన్ ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన తేదీని పొడిగించాలి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: