BJP MP Bandi Sanjay Nomination in Karimnagar : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మంచిరోజు కావడంతో.. పలువురు ప్రముఖులు నామినేషన్ పత్రాల సమర్పణలో బిజీగా ఉన్నారు. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని(Bike Rally) నిర్వహించి స్వాగతం పలికారు.
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం : బండి సంజయ్
ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు నేతలు హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ నామినేషన్‌కు ముందు ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హిందూ ఓట్ బ్యాంకును(Vote Bank) ఏకం చేశానన్నారు. ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీకి విజయపరంపర కొనసాగించినట్లు పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ పార్టీయేనని అటువంటి పార్టీకి ఒక్కఛాన్స్ ఇవ్వాలని కోరారు.
Bandi Sanjay Nomination Rally : ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటానని.. బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మూడేళ్లలో రూ.8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధులు(Smart City Funds) కేంద్రానివేనని.. రేషన్ బియ్యం సహా పల్లెల్లో, మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులు కేంద్ర నిధుల ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికలు కరీంనగర్‌కే పరిమితం కావని.. తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయన్నారు.
'హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్న వ్యక్తి ఆలె నరేంద్ర'
కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతున్నాయి. వాటి కావాల్సిన నిధులను సమకూర్చేది కేంద్ర ప్రభుత్వం. మున్ముందు మరింత అభివృద్ధి బాటలో సాగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిచూడండి. కేంద్రంలో మళ్లీ రాబోయేది మోదీ సర్కారేనని కనుక అటువంటి పార్టీకి అవకాశం ఇస్తే.. కమీషన్లు, కక్కుర్తి లేకుండా నాణ్యతతో నిస్వార్థంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. -బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
50 లక్షల మంది నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయులు, లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, మహిళలంతా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పౌర సరఫరాల శాఖ మంత్రిగా(Civil Supplies Minister) ఉన్నా.. ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలని కోరారు. ఎటు చూసినా అవినీతి, అక్రమాలే. చివరకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కమీషన్లు తీసుకున్న మంత్రికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఏర్పడిందన్నారు.