హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కోట్లు ఖర్చు చేసినా... ప్రభుత్వ పాచిక పారలేదన్నారు. తెరాస కుట్రలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారని తెలిపారు. రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. హజూరాబాద్ ఓటర్లకు, కష్టపడిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
వందల కోట్లు పంపిణీ, వేలాది కోట్ల జీవోలు, అధికార బలంతో ఈటల రాజేందర్ ముఖం అసెంబ్లీలో కనిపించవద్దనే సీఎం కేసీఆర్ పంతం నెరవేరలేదన్నారు. హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా చరిత్ర తిరగరాశారని వ్యాఖ్యానించారు. తెరాస నేతలు ఓటుకు రూ.6వేలు, చివర్లో రూ.10వేలు పంచారని ఆరోపించారు. ప్రజలే నాయకులై తనను గెలిపించబోతున్నారన్నారు. హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానేనని అన్నారు.
'కేసీఆర్ కుట్రను హుజూరాబాద్ ప్రజలు అర్థం చేస్తుకున్నారు. ధర్మాన్ని, ఈటలను కాపాడుకోవాలని భావించారు. హుజూరాబాద్‌లో తెరాస రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు పెట్టింది. తెరాస కుట్రలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారు.'
-ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి
ఇదీ చూడండి: ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్