Bandi sanjay Complaint Police Station Claims Lose Phone: తన సెల్‌ఫోన్ ఎక్కడో పడిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఈనెల 5న ఆయన ఇంటి వద్ద పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట చేసుకుంది. ఇందులో భాగంగానే మొబైల్ పోయినట్లు ఆయన కరీంనగర్ రెండో పట్టణ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.
మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని తేల్చడానికి పోలీసులు బండి సంజయ్ తన మొబైల్‌ను.. తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపై వివాదం నెలకొంది. ఇటీవల బండి సంజయ్‌ను పరామర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సైతం.. ఆ ఫోన్‌ను పోలీసులే తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
సంజయ్ ఫోన్ అడిగితే లేదన్నారు: మరోవైపు పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. బండి సంజయ్ తన ఫోన్ అడిగితే లేదన్నారని పేర్కొన్నారు. ఎక్కడుందంటే తెలియదంటున్నారని అన్నారు. ఆయన మొబైల్ ఇస్తే తమకు కీలక సమాచారం లభిస్తుందని చెప్పారు. అందుకే ఫోన్ ఇవ్వట్లేదని అయినా.. సంజయ్ ఫోన్‌కాల్ డేటా సేకరిస్తామని వివరించారు. ప్రశాంత్ పేపర్ షేర్ చేసిన అందరికి ఫోన్ చేయలేదని రంగనాథ్ పేర్కొన్నారు.
ఎలాంటి కుట్ర చేయకపోతే సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా?: బండి సంజయ్‌కు మాత్రమే ఎక్కువసార్లు ఫోన్ కాల్స్ ఉన్నాయని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు.పేపర్ షేర్ జరగటానికి ముందు జరిగిన చాటింగ్ ఆధారంగానే సంజయ్ అరెస్టు చేశామని తెలిపారు. ఆయన మొబైల్‌ను తమకు ఇస్తే మరింత సమాచారం సేకరిస్తామని చెప్పారు. కమలాపూర్ నుంచి ప్రశ్నపత్రాలు పక్కా పథకం ప్రకారమే లీక్ చేశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే కక్ష రాజకీయాలు అయితే మిగతా బీజేపీ నేతలపై కూడా కేసులు పెట్టాలి కదా అని వెల్లడించారు. ఎలాంటి కుట్ర చేయకపోతే ఆయన ఫోన్ ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: పది ప్రశ్నపత్రం లీకేజీ బండి సంజయ్ ఫోన్ ఇస్తే కీలక సమాచారం సేకరణ
'జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్.. ఆ తరువాత హైదరాబాద్‌లో... '
అమూల్ X నందిని.. కర్ణాటకలో 'పాల' రాజకీయం.. 'గుజరాతీలకు వారు శత్రువులా?'