రెండు పట్టభద్రుల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్‌కు అవసరమైన జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో ఉన్న బాక్సులను 11 జిల్లాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. కొత్తగా 600 డబ్బాలను తయారు చేయిస్తుండగా... మరో వెయ్యి బాక్సులను వేర్వేరు ప్రాంతాల నుంచి సమకూర్చుతున్నారు.
మొత్తం 799 పోలింగ్ కేంద్రాల్లో 5 లక్షలకుపైగా ఓటర్లు... తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున సుమారు 16 వందల బ్యాలెట్ పెట్టెలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎన్నికల బరిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ గోదాముల్లోని జంబో బ్యాలెట్ పెట్టెలను కమిషన్ ఆదేశాల మేరకు తరలిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు.