కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ.. కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం రైతుల పేర్లను వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.