Kodicchera Village Road Problems in Kamareddy : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదని చెప్పడానికి ఈ గ్రామమే నిదర్శనం. ఈ గ్రామానికి వెళ్లాలంటే జాతీయ రహదారి నుంచి 5 కిలోమీటర్లు దూరం లోపలికి వెళ్లాలి. అయితే వెళుతున్న ఆ కాస్త దూరమైనా.. 500 గుంతలతో నరకాన్ని తలదన్నేలా ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లాలంటే ప్రజలు ఎన్నో అవస్థలు పడాల్సిందే. ఆ గ్రామమే కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని మద్నూర్ మండలం కొడిచ్చెర గ్రామం.
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం జాతీయ రహదారి నుంచి చిన్న ఎక్లార గ్రామం మీదుగా కొడిచ్చెర గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల ప్రధాన రహదారి ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ రహదారి గుంతలు పడి, కంకర తేలి అధ్వానంగా తయారైందని తెలిపారు. కాలిబాటన కూడా వెళ్లలేని దుస్థితి ఈ గ్రామ ప్రజలకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డుకు ఇప్పటి వరకు కనీసం ఎలాంటి మరమ్మతులు కూడా చేయలేదని వాపోతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. చాలాసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా రోడ్డు బాగు చేయాలని గ్రామస్థులంతా కలిసి ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు.
విద్యుత్ సంస్థలకే విద్యుత్‌ను అమ్ముతున్న గ్రామం.. రాష్ట్రానికే ఆదర్శం
"ఈ రోడ్డు మార్గం ద్వారానే కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ వెళుతుంటాం. 15 ఏళ్ల నుంచి రోడ్డును ఎవరూ బాగు చేయడం లేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశాము. ఎవరూ తమ సమస్యను పట్టించుకోలేదు. ఓట్లకు మాత్రం ముందుగా వస్తారు. రోడ్డుపై ప్రయాణించాలంటే నరకయాతన అనుభవిస్తున్నాం." -కొడిచ్చెర గ్రామస్థులు
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బురదమయమైన రోడ్డుపై ప్రయాణించాలంటే నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. గుంతలు ఏర్పడిన రోడ్డుపై ముళ్ల పొదలు, రాళ్లు గుర్తుగా పెట్టి.. ప్రాణాలను కాపాడుకుంటున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన కల్వర్టులు కూలిపోతున్నాయన్నారు. గ్రామానికి రోడ్డు బాగోలేక ఆటోలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం కూడా రావడం లేదని తెలిపారు.
KTR inagurate school in Bibipet : మహేశ్‌బాబు కోసం బీబీపేట్ గ్రామస్థుల ఎదురుచూపులు..
ఈ ప్రధాన రహదారి గుండా ఆరు గ్రామాల ప్రజలు నిత్యం బిచ్కుంద, బాన్సువాడ, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని చెప్పారు. గుంతలో ద్విచక్రవాహనదారులు పడి రెండు నెలల వ్యవధిలో నలుగురికి గాయాలయ్యాయని వివరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజా ప్రతినిధులకు తమ గ్రామాలు గుర్తుకు వస్తాయని.. గెలిచిన తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోయారు. రోడ్డు నిర్మాణం చేసే వరకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Govt Hospital Problems : ఆ దవాఖానాకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు.. వైద్యులదీ అదే పరిస్థితి!