కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మీ అనే గర్భిణీ ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 10 గంటలకు వైద్యులు ఆమెకు డెలివరీ చేస్తుండగా.. మధ్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ కూడా పనిచేయకపోవడం వల్ల పసికందు కడుపులోని ఉమ్మనీరు మింగి మృతి చెందింది.
జనరేటర్ అందుబాటులో ఉంటే పాప బతికుండేదని మహిళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతులతో ప్రభుత్వాసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. జనరేటర్ పాడై కొన్నేళ్లవుతున్నా మరమ్మతు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మహిళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.