మరుగుదొడ్ల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారబోయడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ పర్యావరణం కలుషితమవుతోంది. ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాలని స్థానికులు కోరగా.. కామారెడ్డి పురపాలిక అధికారులు ఓ అద్భుత పరిష్కారం చూపారు. మరుగుదొడ్ల వ్యర్థాలను ఎరువుగా మలిచేందుకు పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఈ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వేసేందుకు కార్యచరణ మొదలుపెట్టారు. ఇంకా ఎక్కువ ఎరువు ఉత్పత్తి అయితే రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం
కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీ కలిసి స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. అనంతరం మరో 6 మున్సిపాలిటీలను ఎంపిక చేసి పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అందులో కామారెడ్డి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీని కోటిన్నర రూపాయలతో నిర్మించారు. మొదటగా సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తెచ్చే వ్యర్థాల్ని ఒక చాంబర్లో పోసి అనంతరం పలు దఫాలుగా నీటిని వేరుచేసి మెత్తటి మట్టిలాంటి ముద్దను ఒక చాంబర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఉన్న రూంలోకి పంపుతారు. నీటిని మూడు దఫాలుగా శుద్ధి చేసి చెట్లకు పోసేందుకు ఉపయోగిస్తారు. ఈ ఉద్యానవన పర్యవేక్షణను సీడీఎంఏ చూస్తుంది.
5వేల లీటర్ల వ్యర్థాలతో.. 15% ఎరువు
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఎన్జీటీ సూచనల మేరకు ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు చేశామని, పైలట్ ప్రాజెక్ట్‌లో కామారెడ్డి పురపాలిక ఉండటం ఆనందంగా ఉందని మున్సిపల్ ఇంజినీర్ వాసుదేవ రెడ్డి తెలిపారు. సెప్టిక్ ట్యాంకులు నిండిన ప్రతిసారి.. ఎక్కడెక్కడో పారబోసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారి వ్యర్థాన్ని ఎరువుగా మార్చడం మంచి విషయమని అన్నారు. 5000 లీటర్ల వ్యర్థాలతో 15% ఉపయోగకరమైన ఎరువు, నీరు వస్తోందని వెల్లడించారు.
రైతులకు ఉచితంగా ఎరువు
మరుగుదొడ్ల వ్యర్థాలతో తయారుచేసిన ఎరువు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయితే.. రైతులకు ఉచితంగా అందిస్తామని పురపాలక అధికారులు చెబుతున్నారు.