కామారెడ్డి జిల్లాను పట్టణ బృహత్ ప్రణాళిక అంశం కుదిపేస్తోంది. పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ అన్నదాత ఉవ్వెత్తున నిరసనలు చేపట్టిన వేళ.. కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వారి సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బృహత్ ప్రణాళికపై రైతులు అనవసరంగా అపోహ పడుతున్నారని.. అది ఇంకా ముసాయిదాగానే ఉందని పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు 1,026 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే. అందులో మార్పులు, చేర్పులు జరుగుతాయి. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటాం. ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని ఇప్పటికే ప్రకటించాం. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా వేశాం. ఇప్పటి వరకు 1026 అభ్యర్థనలు వచ్చాయి. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందనక్కర్లేదు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం. - జితేష్ పాటిల్, కామారెడ్డి కలెక్టర్
కామారెడ్డిలో రైతులపై లాఠీ ఛార్జ్‌ను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి కామారెడ్డి ఘటన అద్దం పడుతుందని ఆయన విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. భాజపా కార్యకర్తలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, కేసీఆర్ అనుచరులు భూములను ఆక్రమించుకునేందుకే ధరణి పోర్టల్ ఉపయోగపడుతుందని తరుణ్ చుగ్ ఆరోపించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ ప్రణాళిక ప్రవేశపెట్టాలని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారిగా రైతులు ఇంత పెద్ద ధర్నాలు చేశారని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విలీన పంచాయతీ పాతరాజంపేటలో రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేశారు. భూములను గ్రీన్ జోన్ కింద చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 500 మందికి పైగా రైతులు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. మరికొందరు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చూడండి..
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై కలెక్టర్ క్లారిటీ.. ఏం చెప్పారంటే?