CM KCR Speech at Birkur Meeting: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బాన్సువాడ పర్యటనలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనస్సులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పురుడు పోసుకోవటానికి నిజాంసాగర్‌కు పట్టిన దుస్థితి కూడా కారణమని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఇలాంటి ఎన్నో సమస్యలకు ఎంత ప్రయత్నించినా పరిష్కారం దొరకలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదన్న కేసీఆర్.. నిజాంసాగర్ ఎప్పటికీ ఎండిపోయే ప్రశ్నే రాదన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌లో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దాతల సహకారంతో స్వామివారికి చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ సతీమణి ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించారు.
తానున్నన్ని రోజులు పోచారం ప్రజలకు సేవ చేయాల్సిందే: వెంకటేశ్వర స్వామి కల్యాణం అనంతరం.. స్థానిక ఎమ్మెల్యే, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. సమైక్య పాలనలో నిజాంసాగర్ దుస్థితిని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి.. సాగర్ మరోసారి ఎండిపోయే ప్రసక్తే లేదన్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజాసేవ, ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
తానున్నన్ని రోజులు పోచారం ప్రజలకు సేవ చేయాల్సిందేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బాన్సువాడకు రూ.50 కోట్లు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.7 కోట్లు ప్రకటించారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గతంలోనూ సీఎం రూ.23 కోట్లు మంజూరు చేశారు.
'సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకోవడంలో నిజాంసాగర్ కూడా ఒక భాగమే. బాన్సువాడ ప్రాంతంలో గతంలో అనేక ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం రూ.15 వందల కోట్ల వరి పంట సాగవుతోంది. బాన్సువాడ ప్రజలకు భవిష్యత్తులోనూ స్పీకర్ పోచారం సేవలు అవసరం. వెంకటేశ్వర ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నాం. బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం.'-సీఎం కేసీఆర్
పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డారన్న సీఎం కేసీఆర్.. ఆయన ఇంకెంతో కృషి చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేయాలని సూచించారు. పోచారం మాటనే బ్రహ్మాస్త్రంలాగా ఉంటుందని ఆయన సేవలను కొనియాడారు. మంజూరు చేసిన నిధులు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఎమ్మెల్యేకే వదిలేస్తున్నామని తెలిపారు. భగవంతుని కల్యాణంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: