కామారెడ్డి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ సమావేశం కోసం 103 అంశాలతో కౌన్సిలర్లకు సమాచారమిచ్చారు. సమావేశానికి హజరైన భాజపా కౌన్సిలర్లు తమకు చదువుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడంలో అంతరార్థం ఏముందని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు ఉండటం వల్ల బిల్లులకు ఛైర్మన్, అధికార పార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపి వెళ్లిపోవటం పట్ల భాజపా నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ పద్ధతి సరికాదంటూ కౌన్సిల్ సమావేశంలో ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీలో అనేక సమస్యలున్నాయని ఆరోపించారు. కూరగాయల మార్కెట్ లాంటి ముఖ్య సమస్యలు ఉన్నా కేవలం పట్టణ సుందరీకరణ కోసం కోట్లాది రూపాయల తీర్మానాలు చేసి సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తమను కౌన్సిలర్లుగా కూడా గుర్తించడం లేదని, సమావేశం ముగిసిందని వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 103 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగాలని... జరిగిన సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా కౌన్సిలర్ల ఆరోపణలపై తెరాస నేతలు స్పందించారు. మూడు రోజుల ముందే ఎజెండా అంశాలు అందరికీ పంపించామన్నారు. ఎజెండా అంశాలు చదువుకోకుండా సమావేశానికి వచ్చి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏ అంశానికి కేటాయించిన నిధులు వాటికి మాత్రమే ఉపయోగిస్తామని... సాధారణ నిధుల నుంచి మళ్లించడం లేదని స్పష్టం చేశారు.