ఆశ కార్యకర్తలకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగన్న డిమాండ్ చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలపై పని భారం ఎక్కువైందని తెలిపారు. ఈ విషయాన్ని చాలామార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు ఏఎన్‌ఎంలు, పర్యవేక్షకులు ఆశ కార్యకర్తలపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. వేతనాలు కట్ చేస్తామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారాలు, పండగ రోజుల్లోనూ సెలవులు ఇవ్వకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యుడు రవీందర్‌సింగ్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. అత్యవసర సేవలు మినహా ఇతర పనులు చేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వామి, ఆశ యూనియన్ నాయకులు లావణ్య, గీతా, పద్మ, సంతోషి, పుష్ప, మౌనిక, వనిత, మమత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రోడ్డు దాటేముందు జాగ్రత్త.. లేదంటే బలైపోవాల్సిందే..!