జోగులాంబ గద్వాల్ జిల్లాలో రాజోలి మండల కేంద్రంలో ఉన్న వైకుంఠ నారాయణస్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వైకుంఠ నారాయణ స్వామి గుడికి... అప్పటి రాజులు దూప దీప నైవేద్యం కోసం సుమారు 250ఎ కరాల భూమిని ఈనాం గా ఇచ్చారు. ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవండం వల్ల చాలా వరకు భూములు అన్యాక్రాంతం అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా సర్వే నం. 454లో ఉన్న 9 ఎకరాల 30 గుంటల భూమిని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొమ్మిది ఎకరాల్లో ఇంకా సుమారు రెండు ఎకరాల భూమి మిగిలి ఉందని... దాన్ని కూడా ఓ వ్యక్తి అక్రమించాడని తెలిపారు. స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ స్థలం విలువ సుమారు కోటి నుంచి 2 కోట్లుగా ఉందని సమాచారం.
కొందరు గ్రామస్థులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకోగా... మిగిలిన ఈ భూమిని అప్పటి పూజారి ప్రైవేట్ వ్వక్తికి అమ్మినట్టు తెలింది. స్థానికులంతా... కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం వల్ల రిజిస్ట్రేషన్ నిలిపి వేశారు. దేవాలయ భూములకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి... దేవాలయ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏం చేయడానికైనా సిద్ధంమని హెచ్చరిస్తున్నారు.