Viral Fevers in Gadwal District : మారుతున్న వాతావరణం, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి విషజ్వరాలు పెరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం తుర్కోనిపల్లిలో.. జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలుండగా 400 మందికి పైగా జనాభా ఉన్నారు. 10 రోజుల నుంచి గ్రామంలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
సగానికి పైగా ఇండ్లలో ఒకరిద్దరు జ్వరాల బారినపడ్డారు.కొందరు స్థానికంగా చికిత్స తీసుకుంటుండగా.. మరి కొందరు గద్వాల ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం, వర్షాల కారణంగా.. రోడ్లు, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ పెరగడంతో దోమలు విపరీతంగా ఉండటం వల్లే తాము జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...!
Seasonal Diseases in Telangana : డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు వస్తున్నాయని అంటున్నారు. గ్రామంలో చాలామంది జ్వరాలబారిన పడ్డారని తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తుర్కోనిపల్లిలో ఇంటికి ఒకరిద్దరు మంచాన పడటంతో ఆలస్యంగా మేల్కొన్న వైద్యారోగ్యశాఖ.. గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు వైద్యులు సహా 10మంది సిబ్బందిలో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
"గత కొన్నిరోజులుగా మా గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మారుతున్న వాతావరణం, కురుస్తున్న వర్షాలతో విషజ్వరాలు పెరుగుతున్నాయి. కుటుంబానికి ఇద్దరికి జ్వరం సోకుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల జ్వరాలు వస్తున్నాయి". - స్థానికులు, తుర్కోనిపల్లి
Dengue Fever Symptoms : డెంగీ జ్వరం వచ్చిందా.. ఈ లక్షణాలున్నాయా.. ఏం చేయాలంటే..?
Seasonal Diseases Gadwal District : సుమారు 200మందికి పరీక్షలు నిర్వహించామని ఇప్పటి వరకూ ఇద్దరు డెంగీ బారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారి రక్తనమూనాలు తీసి పరీక్షల కోసం పంపామని.. ఫలితాలు వస్తే ఎంతమంది డెంగీ బారిన పడ్డారో తెలియనుంది. సీజన్ మారడంతో ఎక్కువ మంది వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో గ్రామంలో పారిశుద్ధ్యపనులు చేపట్టారు.
నీటినిల్వలు తొలగించడం, దోమల కోసం ఫాగింగ్, మురికి కాల్వలు, ఖాళీ ప్రదేశాల్ని శుభ్రం చేస్తున్నారు. గ్రామస్థులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని కావాల్సిన వైద్యం అందించేందుకు తాము ఊళ్లోనే.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది.
మూడు, నాలుగు రోజుల్లో వందమంది వరకూ జిల్లా ఆసుపత్రికి జ్వరపీడితులు రాగా.. అందులో 4 డెంగీ కేసులుగా గుర్తించారు. జలుబు, దగ్గు బారిన పడి వచ్చే రోగుల సంఖ్య సైతం పెరుగుతున్నట్లు జిల్లా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Seasonal Diseases : రాష్ట్రంలో వర్షాలు.. సీజనల్ వ్యాధుల పట్ల జరంత జాగ్రత్త!