uttanur Government school : చూడ్డానికి కార్పొరేటు విద్యాసంస్థల్నితలదన్నేలా కనిపిస్తున్న ప్రాంగణం.. అందమైన తరగతి గదులు.. సకల సౌకర్యాలతో కళకళలాడుతున్న పాఠశాల భవనాలు. ఇవన్నీ చూసి.. ఏదో ప్రైవేటు స్కూల్ అనుకుంటే పొరపాటే. ఇది జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు ప్రభుత్వ పాఠశాలల సముదాయం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రాథమిక పాఠశాల, 6 నుంచి పదోతరగతి వరకూ ఉన్నతపాఠశాల రెండూ ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. ఆరెకరాల విస్తీర్ణంలో బడి విస్తరించి ఉంది. 540మంది విద్యార్థులు చదువుతున్నారు. సరిపడా తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మంచి నీటికోసం ఆర్వో వాటర్ ప్లాంట్.. 300మందికి సరిపడా భోజనశాల.. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే ఇన్నోవేషన్ ల్యాబ్.. డిజిటల్ లైబ్రరీ ఇక్కడి ప్రత్యేకతలు. చదివితే ఇలాంటి బళ్లోనే చదువుకోవాలని అనిపించేలా వసతుల్ని తీర్చిదిద్దారు.
పచ్చదానికి నిలయం
పచ్చదనానికీ నిలయంగా నిలుస్తోంది ఈ పాఠశాల. బడి ఆవరణలో పచ్చనిచెట్లు, రంగురంగుల పూల మొక్కలు దర్శనమిస్తాయి. మధ్యాహ్న భోజనం కోసం కిచెన్ గార్డెన్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. విశాలమైన క్రీడామైదానం, బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది.
డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్ వంటి కొత్త కొత్త సదుపాయాలు మా పాఠశాలలో ఉన్నాయి. మిగతా పాఠశాలలతో పోల్చితే మా పాఠశాలలో ఇన్నోవేషన్ ప్రత్యేకంగా ఉంది. కొన్ని పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసి.. ఇన్నోవేషన్ ల్యాబ్‌లకు డబ్బులు ఇచ్చారు. కానీ మా పాఠశాలకు ఇవ్వలేకపోయినా కూడా దాతల సాయంతో మేం ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నాం.
-విద్యార్థి
ఈ స్కూల్‌కు రావడం చాలా అదృష్టం. పక్క ఊరు నుంచి వచ్చి చదువుకుంటున్నాం. అయినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా హెడ్మాస్టారు సొంత డబ్బులు ఖర్చు చేసి.. మేం పాఠశాలకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలో చదువుకోవడం చాలా సంతోషంగా ఉంది.
-విద్యార్థులు
వసతుల నిర్వహణ విద్యార్థులదే..
వసతుల నిర్వహణ బాధ్యతలు విద్యార్థులే చూస్తారు. 30 మంది విద్యార్థులు చొప్పున 5 సంఘాలు ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన తిరుమలరెడ్డి సగానికి పైగా విరాళం ఇవ్వడంతోపాటు.. మిగిలినవి దాతల నుంచి సేకరించి బడిని తీర్చిదిద్దారు. సుమారు రూ.40లక్షలకుపైగా వసతుల కోసం ఖర్చు చేశారు.
మధ్యాహ్న భోజన నియమాలకు అనుగుణంగా బిందుసేద్యంతో సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు పండిస్తున్నాం. ఈ ప్రాంతంలో కార్పొరేట్ స్కూల్కన్నా ఎక్కువగా మా పాఠశాల అభివృద్ధి చెందడం మాకు ఆనందదాయకం.
ఏబేలు, తెలుగు ఉపాధ్యాయుడు
సైన్సు ల్యాబ్ వల్ల పిల్లల్లో శాస్త్రియ దృక్పథం, శాస్త్రియ ఆలోచనను పెంపొందించవచ్చు. సమాజంలో జరిగే అనేక సమస్యలను పరిశీలించి... వాటిని ఎలా పరిష్కరించవచ్చో పిల్లలు ఆలోచన జరుపుతారు. అనంతరం వాళ్ల వరకు చర్చలు జరుపగలరు. ఇక్కడ ఉన్న పరికరాల సాయంతో పలు ప్రయోగాలు కూడా చేస్తారు. ఈ స్కూల్ జిల్లాలోనే ప్రత్యేకంగా నిలిచింది. దీనికి మేమెంతో గర్వపడుతున్నాం.
-ఆనంద్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు
దాతలు ముందుకు రావాలి..
సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సర్కారు బళ్లను బాగుచేసుకోవాలని భావించే గ్రామాలకు, ప్రజలకు.. స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఉత్తనూరు పాఠశాల. ఇతర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూడా దాతలు మందుకు రావాలని ఆ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.
గ్రామపెద్దల సహకారంతో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. చాలామంది డోనర్లు ఇందుకు సహకరించారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.35 నుంచి రూ.40 లక్షలు ఖర్చు అయింది. ప్రభుత్వ పాఠశాల బాగుపడితే... పేద విద్యార్థులకు బాగు పడతారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పాఠాశాలలను అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకు రావాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తే... విద్యార్థులు ఏ విధంగా ఎదుగుతారో తెలియజేయడానికి మా పాఠశాలను అభివృద్ధి చేశాం.
తిమ్మారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు
ఇదీ చదవండి: ఆరు స్థానాల్లోనూ స్వతంత్రుల ప్రభావం.. కొంతమేరకు క్రాస్ ఓటింగ్!