కాటికి చేరే దాకా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకు కాదు పొమ్మన్నాడు. దిక్కుతోచని వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. చలికి వణుకుతూ బతుకుతున్న ఆ వృద్ధ దంపతులను చూస్తే మనసు కలిచివేయక మానదు. రెండెకరాల పొలం, ఇల్లు ఉన్నా.. రోడ్డున పడ్డ ఈ దంపతులను చూసి స్థానికుల మనసు కలిచివేస్తోంది. కానీ కర్కశ కొడుకు మనసు మాత్రం కరగడం లేదు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన బత్కన(75), బతుకమ్మ(65) భార్యాభర్తలు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. దంపతుల పేరుపై రెండు ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉన్నాయి. ఆస్తిని అనుభవిస్తున్న కుమారుడు తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. నిత్యం తమను బయటకు వెళ్లిపోవాలని రోజూ కొడుకు, కోడలు హింసించేవారని వృద్ధులు కన్నీరు మున్నీరయ్యారు.
తాము పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా.. కుమారుని తీరులో మార్పు రాలేదని వాపోయారు. చివరకు పెద్దమనుషుల దగ్గర పంచాయితీ చేసి అద్దె ఇంట్లో పెట్టడానికి ఒప్పుకున్నాడని తెలిపారు. అద్దె ఇల్లు యజమానిని కూడా తమ కొడుకు భయభ్రాంతులకు గురిచేసి తమను ఖాళీ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ వృద్ధులు నాలుగు రోజులుగా ఇంటి ముందే జీవనం సాగిస్తున్నారు. అక్కడే వంట చేసుకుంటూ.. చలికి వణుకుతూ.. ఉంటున్నారు. అయినా కొడుకు కనికరించకపోవడం అందరిని కలిచి వేస్తోంది. ఎక్కడికైనా వెళ్లి చావండని... లేకపోతే తానే చంపేస్తానని కన్నకొడుకే బెదిరిస్తున్నాడని వారు వాపోయారు. ఎవరైనా కుమారుడికి నచ్చజెప్పేందుకు వెళ్తే వారిని కూడా తిడుతుండటంతో ఎవరూ ముందుకు వెళ్లట్లేదన్నారు.
ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమను బాగా చూసుకుంటాడని అనుకున్న తల్లిదండ్రులకు ఆ కొడుకే హింసించడం... కోడలు వంత పాడడం మానవత్వానికి మాయని మచ్చగా మారింది. ప్రభుత్వం కల్పించుకుని తమ పొలం, ఇల్లు తమకు ఇప్పించాల్సిందిగా ఆ వృద్ధ దంపతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : 'మాతృత్వాన్ని మరిచి కన్నతల్లిపై హత్యాయత్నం '