జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక అక్రమదందా జోరుగా సాగుతోంది. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలే అడ్డాగా అక్రమ దందాకు తెరలేపారు. నదికి వరద వచ్చినప్పుడల్లా తీరప్రాంతాల్లో ఇసుక కుప్పలుగా పేరుకుపోతోంది. వరద తగ్గగానే ఇసుకను నదిలోంచి ఒడ్డుకు తరలిస్తారు. రహస్యంగా డంపులు పోస్తారు. అక్కణ్నుంచి ఇతర ప్రాంతాలకు అనుమతులు లేకుండానే తరలిస్తారు. ఈ తరహా వ్యవహారం అలంపూర్ నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను తరలిస్తే పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకుంటుండటంతో ఎడ్లబండ్లలో నింపి ఒడ్డున డంపులుగా పోస్తున్నారు. నదిలో నీటిప్రవాహం ఉన్నా ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను వెలికితీస్తున్నారు.
తూర్పు గార్లపాడు, పుల్లూరు, పెద్దధన్వాడ, తుమ్మిళ్ల, రాజోలి, మెన్నిపాడు, కలుగొట్ల, ర్యాలంపాడు తదితర గ్రామాల్లో అక్రమదందా జోరుగా సాగుతోంది. ఇసుక తరలింపును అధికారులు అడ్డుకోవాల్సినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ దందాలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల సర్కార్ ఖజానాకు గండిపడుతోంది.
ఇటీవల ఉండవల్లి మండలం మెన్నిపాడు, రాజోలి తదితర ప్రాంతాల్లో ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.-రంజన్ రతన్ కుమార్, ఎస్పీ
నిబంధనల ప్రకారం ఎండ్లబండ్లలో ఇసుకను తరలించుకొని స్థానిక అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఉన్నా ఆ పేరుతో అమ్మకాలు జరపడం విరుద్ధం. ఇటీవల ఇసుక అక్రమ దందాపై పోలీసులు కొరడా ఝులిపించినా సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది.-సుబ్రమణ్యం, ఉండవల్లి తహసిల్దార్
ఇదీ చూడండి: