జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదోరోజు మహాగౌరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ముందుగా స్వామివారిని మంత్రి దర్శించుకొని అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
దైవ దర్శనం...
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దేవీ నవరాత్రుల సమయంలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాచీనమైన ఆలయాలను దర్శించుకుంటే ప్రశాంతత కలుగుతుందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల వివరాలు సంబంధిత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు.
అన్నదాతకు అండగా...
కరోనా వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పటికీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో మక్కలు వద్దని చెప్పినప్పటికీ రైతులు సాగుచేశారని... ప్రతికూల పరిస్థితుల్లో అన్నదాతలు నష్టపోతారనే ఉద్దేశంతో పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పత్తి కొనుగోలుకు సీసీఐ, మార్కెటింగ్ శాఖతో చర్చించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా కేసీఆర్ అండగా ఉన్నారని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే వీఎం అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, వినియోగదారుల ఫోరం ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, పంచాయతీ రాజ్ ట్రైబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు