ఒకప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో చేరడానికి ఇష్టపడని వారు గురుకుల రెసిడెన్సియల్ వచ్చాక గురుకులాల్లో చేరేందుకు పోటీ పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకులాలు నడుస్తున్నాయని చెప్పేందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు... జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యార్థులు. అలంపూర్ నియోజకవర్గంలో ఎస్సీ గురుకులాల్లో విద్యనభ్యసించిన ఐదుగురు విద్యార్థులు ఎంబీబీయస్ సీట్లు సాధించారు. ఐదుగురూ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు గురుకులాల్లో చదివిన వారే. వారి తల్లిదండ్రులు కూడా... రోజు వారి కూలీలే. ఒకరు వ్యవసాయ కూలీ, మరొకరేమో ఆటో డ్రైవర్, ఇంకొకరేమో దినసరి కూలీ.
ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు...
అలంపూర్ మండలం ఉట్కూరుకు చెందిన రోహిత్ కాంత్‌కు సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. మానవపాడు మండలం జల్లాపురంకు చెందిన లావణ్యకు సిద్దిపేట మెడికల్ కళాశాలలో... చిన్నతాండ్రపాడుకు చెందిన విక్రమ్‌కు కరీంనగర్ ప్రతిమ కళాశాలలో... ఉప్పలకు చెందిన రాకేశ్‌కు మహబూబ్‌నగర్ కాలేజీలో... పుల్లూరుకు చెందిన పవన్ కుమార్‌కు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి.
గురుకులాలిచ్చిన భరోసాతోనే...
ఎంబీబీయస్‌లో సీట్ రావడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వానికి, గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి పేద విద్యార్థులు చదువుకోడానికి గురుకులాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా గురుకులాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. తాము కూడా మెడిసిన్ చదవగలమనే భరోసాను ఈ గురుకులాలే ఇచ్చాయంటున్నారు. గౌలుదొడ్డి గురుకుల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే సీట్లు సాధించామని విద్యార్థులు తెలిపారు.
గర్వంగా ఉంది...
కూలీ పని చేసుకుని జీవించే తమ పిల్లలు మెడిసిన్‌లో సీటు సంపాదించటం నమ్మలేకపోతున్నామని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చిన్నప్పటి నుంచి గురుకులాల్లోనే చదివి డాక్టర్ సీటు సాధించారని తెలిపారు. గురుకులాలు లేకుంటే పేదవాళ్లైన తాము డబ్బులు పెట్టి పిల్లలను చదివించే వాళ్ళం కాదన్నారు. పిల్లలు సీటు సాధించటం తమకెంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.