లాక్డౌన్ సమయంలో తెరాస ప్రభుత్వం ఇష్టానుసారంగా విధించిన విద్యుత్ ఛార్జీలలో మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో విద్యుత్ బిల్లులు పెంచడం సమంజసం కాదని మండిపడ్డారు. బీపీఎల్ కుటుంబాలకు కరెంట్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న మాదిరిగానే టెలిస్కోపిక్ విధానంలో మీటర్ రీడింగ్ చేస్తే విద్యుత్ బిల్లులు తగ్గుతాయని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ పరీక్షలు నిర్వహించి వైరస్ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.