జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైకిళ్ల మీద కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు.
భాజపా అసమర్థ పాలనలో డీజిల్,పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శృతి ఓజాకు వినతి పత్రం అందజేశారు. భాజపా ప్రభుత్వం సామాన్యులను కష్టాల్లోకి నెడుతున్నదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి.. లాక్డౌన్ సమయంలో మరింత భారం మోపిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గినా వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలను కావాలనే ఇబ్బందుల పాలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్