జోగులాంబ గద్వాల జిల్లాలోని జమ్మిచేడులో కొలువుదీరిన జమ్ములమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి పుట్టినిల్లయిన గుర్రంగడ్డ నుంచి ఎద్దులబండిపై మేళతాళాలతో అమ్మవారిని ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక... మహరాష్ట, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో క్యూలైన్లు భక్తజనంతో కిటకిటలాడాయి. జమ్ములమ్మకు పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి రిజర్వాయర్లో పుణ్యస్నానాలు ఆచరించారు.
గుడారాలు వేసి... నైవేద్యాలు వండి...
ఆలయ పరిసరాల్లో గుడారాలు వేసుకొని భక్తులు నైవేద్యం వండి... అమ్మవారికి సమర్పించారు. మేకలు, కోళ్లు కోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు తీవ్ర ఇబ్బందిగా మరిందని పలువురు వాపోతున్నారు. 6 రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంచనీయ ఘటనాలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమీపంలోని పరశురామ స్వామి ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
జమ్ములమ్మ మహత్యం...
జోగులాంబ గద్వాల జిల్లాలోని జమ్మిచేడులో కొలువైన జమ్ములమ్మ అత్యంత మహిమలు గల తల్లి. ఆ దేవత గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. నాలుగు వందల సంవత్సరాల నాటి మాట. ప్రస్తుతమున్న జమ్ములమ్మ దేవస్ధానం ఒకప్పుడు అటవీ ప్రాంతం. అక్కడ ఒక రైతు పొలం దున్నుతుండగా... గడెం లోతుగా పోనందున బరువు కోసం ఒక రాయిని
వెతికితెచ్చాడు. గడెంపై రాయిని పెట్టి పొలం దున్నిన తర్వాత రాయితో పాటే గడెంను అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే... గడెంపై రాయి లేదు. మళ్లీ మునుపటి స్థానంలోనే ఉన్న రాయిని తేచ్చి గడెం దున్ని ఇంటికి పోయాడు. మళ్లీ మరుసటి రోజు కూడా గడెంపై రాయిలేదు. ఎవరో కావాలనే రాయిని తీస్తున్నారని... వారిని కనిపెట్టాలని తలచి... ఆరోజు రాత్రి పొలం దగ్గరే పడుకున్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటల ప్రాంతంలో రాయి అందమైన దేవత రూపంలోకి మారి... తెల్లటి దుస్తులు ధరించి తన స్థలంలోకి వెళ్లి రాయిగా మారింది.
కొంగు బంగారం...
అమ్మవారిని చూసిన రైతు తన జన్మ ధన్యమైందని భావించి స్థానికులందరికి విషయం తెలిపాడు. మరుసటి రోజు రాత్రి గ్రామస్థులంతా... అమ్మవారి రూపాన్ని చూసి ఆశ్యర్చపోయారు. అప్పటి నుంచి ప్రతి వ్వవసాయదారుడు తాను పోలం దున్నేటప్పుడు, విత్తనాలు వేసేటప్పుడు... అమ్మవారిని కొలిస్తే... పంటలు బాగా పండేవని నమ్మవారు. అప్పటినుంచి భక్తుల కొంగు బంగారంగా జమ్ములమ్మ తల్లి దీవెనలు అందిస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో పూజిస్తారు. జమ్మిచేడు నుంచి పది కిలో మీటర్ల దూరంలో కృష్టా నది మధ్యలో ఉన్నదీవి గ్రామం గుర్రంగడ్డ. ఇదే అమ్మవారి పుట్టిల్లని భక్తుల విశ్వాసం. ఏటా మాఘ శుద్ద పౌర్ణమి ముందు మంగళవారం రోజున అమ్మవారిని గుర్రంగడ్డ నుంచి ఆలయానికి మేళతాళాలతో తీసుకొస్తారు.